ముస్లిముల విశ్వాసాన్ని బీజేపీ కచ్చితంగా పొందుతుంది: రషీద్ అన్సారీ
బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముస్లిముల విశ్వాసాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తోందని తెలిపారు.
బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముస్లిముల విశ్వాసాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తోందని తెలిపారు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అనే భ్రమలు తొలిగించడం కోసం తాము పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. మైనారిటీల విషయంలో బీజేపీ పార్టీ శ్రద్ధతో పనిచేస్తుందని.. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం వల్ల ప్రజలకు వ్యతిరేక సిగ్నల్స్ వెళ్తున్నాయని అన్సారీ అన్నారు.
అనేకమంది ముస్లిములతో పాటు మైనారిటీ, బీసీ సంఘాలు బీజేపీ నాయకత్వం పట్ల సంతృప్తితోనే ఉన్నారని.. మోదీ ప్రభుత్వం చెప్పే ప్రభుత్వం కాదని.. చేతలు చేసే ప్రభుత్వం అని వారు ఇప్పటికే తెలుసుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ మధ్యకాలంలో ముస్లిములపై పెరుగుతున్న దాడులపై కూడా అన్సారీ స్పందించారు. ఇలాంటి విషయాలపై నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా ఇది వరకే స్పందించారని.. దేశంలో అలజడి రేకెత్తించేందుకు కొన్ని అరాచక శక్తులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని... వాటికి అడ్డుకట్ట వేసేందుకు మోదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్సారీ అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులకు భారీ స్థాయిలో టికెట్లు ఇచ్చిందని అన్సారీ తెలిపారు. అన్ని పంచాయతీ ఎన్నికలలో కలిపి దాదాపు 850 ముస్లిములకు టికెట్లు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముస్లిముల పట్ల బీజేపీ బాధ్యతాయుతమైన వైఖరికి ఇదే నిదర్శనమని.. మైనారిటీ సంఘాలకు ఇచ్చే నిధుల శాతాన్ని కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీజేపీ మాత్రమే ఎక్కువ పెంచిందని.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనేదే తమ పాలసీ అని అన్సారీ చెప్పారు. మతపరమైన వివాదాలు బీజేపీతో పోల్చుకుంటే... కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగాయని.. బీజేపీకి అన్ని మతాలూ సమానమేనని.. అన్ని మతాలను గౌరవించే పార్టీ బీజేపీ అని రషీద్ అన్సారీ తెలియజేశారు.