మోదీ జిమ్మిక్కులు ఇక్కడ పనిచేయవు: సిద్దరామయ్య
మోదీ జిమ్మిక్కులు కర్ణాటకలో పనిచేయవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
మోదీ జిమ్మిక్కులు కర్ణాటకలో పనిచేయవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఐదురోజుల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్రదుర్గలో పర్యటించిన ప్రధాని మోదీ.. ముధోల్ జాతి శునకాల నుంచైనా కాంగ్రెస్ దేశభక్తిని నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్విటర్ ద్వారా స్పందించారు.
‘ప్రధాని మోదీ మాటలతో కర్ణాటక ప్రజలు తికమకపడుతున్నారు. ఆయన పనికొచ్చే మాటలను వదిలేసి, అనవసర విషయాల గురించి మాట్లాడుతుంటారు. నా పోటీ ఆయనతో కాదు. నా ప్రధాన ప్రత్యర్థి యడ్యూరప్పే. నేను నా ప్రత్యర్థికి బహిరంగ సవాలు విసురుతున్నాను. ఒకే వేదికపై చర్చకు రాగలరా? ఇందులో ప్రధాని కూడా పాల్గొనొచ్చు.' అని అన్నారు.
'ఇప్పటికే ప్రధాని తన ప్రసంగాల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి ఏవేవో మాయమాటలు చెప్తున్నారు. మహాదయి నది వివాదం, వ్యవసాయ కూలీలకు ప్రమాద బీమా అని ఎన్నెన్నో వల్లేవేస్తున్నారు. ఇది కర్ణాటక. ఆయన మాటలు ఇక్కడి ప్రజలు ఎవరూ నమ్మరు. ఎన్నో సమావేశాల్లో మోదీ పాల్గొన్నా.. ఏ ఒక్క చోటా కూడా ప్రధానిలా హుందాగా మాట్లాడలేదు. కర్ణాటకలోని బీజేపీ నాయకులంతా మోదీ జపమే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నేతలకు ప్రజల ముందుకెళ్లడానికి ధైర్యం లేదు. ఈ జాబితాలో యడ్యూరప్పది మొదటిస్థానం.’అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.