ఆ దాడికి ఆర్ఎస్ఎస్దే బాధ్యత: ఆర్జేడీ నేత
శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భగవత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు
శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. "ఇటీవలే మోహన్ భగవత్ 14 రోజులు బిహారులో ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. అదే ట్రైనింగ్ క్యాంపులో శ్రీరామనవమి నాడు ఏ విధంగా మత ఘర్షణలను రెచ్చగొట్టవచ్చన్న అంశంపై ప్రణాళికలు రచించారు.
ఇప్పుడిప్పుడే బిహార్ ప్రజలు ఆర్‌ఎస్ఎస్ భావజాలం ఎలాంటిదో అర్థం చేసుకుంటున్నారు" అని ఆయన తెలిపారు. ఇటీవలే శ్రీరామనవమి నాడు పలువురు బిహార్‌లో జామా మసీదు ప్రాంతంలో 50 షాపులకు నిప్పంటించారు. ఇదే ఘటనలో 60 మంది స్థానికులకు, 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
సోమవారం వరకు అదే ప్రాంతంలో కర్ఫ్యూ కూడా కొనసాగింది. అయితే బిహార్‌లో జరిగిన ఈ సంఘటనపై కేంద్రమంత్రి హన్సరాజ్ అహిర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. లా అండ్ ఆర్డర్ బాధ్యతలను కూడా బిహార్ సక్రమంగా నిర్వహించలేకపోతుందని విమర్శించారు.