ఒక వ్యక్తిపై ఏకకాలంలో దాడి చేసిన కోతుల గుంపు అతడి వద్ద వున్న బ్యాగుని ఎత్తుకెళ్లాయి. ఆ బ్యాగ్‌లో తన కష్టార్జితం రూ.2 లక్షలు ఉండటంతో లబోదిబోమనడం ఆ బాధితుడి వంతయ్యింది. ఆగ్రాలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ముఖ్యంగా ఆగ్రాలో ఇటీవల కాలంలో కోతుల దాడులు అధికమవడంతో ఎప్పుడు, ఎటువైపు నుంచి కోతుల గుంపు దాడి చేస్తుందా అనే భయం ఆగ్రా వాసుల్లో వ్యక్తమవుతోంది. రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన ఘటనలో బాధితుడు విజయ్ భన్సల్ కోతులతో పోరాడి అందులోంచి ఎలాగోలా రూ.60 వేలను మాత్రం తిరిగి సొంతం చేసుకోగలిగినప్పటికీ మిగతా మొత్తం మాత్రం ఏమయ్యాయనే వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను ప్రశ్నించారు. కోతులకు శిక్షణ ఇచ్చి, వాటి చేత దొంగతనాలు చేయించే దొంగల ముఠా ఏమైనా ఈ ఘటన వెనుక వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలావుంటే, ఆగ్రాలో కోతులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా స్థానికులు, తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు అక్కడి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా కోతులకు ఆహారం పెట్టవద్దని, వాటికి ఎంత దూరంగా వుంటే అంత మంచిది అని ఆగ్రా అధికారులు స్థానికులను అప్రమత్తం చేయడం గమనార్హం.