పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై నియమించిన కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 18 పనిదినాల్లో రాజ్యాంగ 123వ సవరణ బిల్లు (జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ద హోదా కల్పించడం), ట్రిపుల్ తలాఖ్ బిల్లు, ట్రాన్స్‌జెండర్‌ (ఎల్జీబీటీ) బిల్లుతో పాటు ఇతర కీలక ముసాయిదా బిల్లులను ఆమోదింపచేసుకొనేలా కేంద్రం భావిస్తోంది. వీటితో పాటు ఓబీసీ, మెడికల్, వినియోగదారుల రక్షణ, తప్పనిసరి విద్య ఎన్‌సీఈఆర్‌టీ వంటి బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.


వచ్చే ఏడాది ఎన్నికలు వస్తుండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లే అవకాశముంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అనంత్ కుమార్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వచ్చినా దానిపై కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.