జైపూర్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ)కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని  ప్రశంసించిన నటి నందితా దాస్ గురువారం జైపూర్ లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్) సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె అన్నారు. సీఎఎ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని నందితా దాస్ ప్రజలను ప్రోత్సహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ప్రభుత్వం, నాలుగు తరాలుగా ఇక్కడ నివసిస్తున్న వారిని భారతీయులు అని నిరూపించమని అడుగుతున్నారని, ఇది చాలా విచారకరమని, దీనిపై ప్రతి ఒక్కరు మాట్లాడాలని, వాస్తవాలు తెలియజేసి పౌరులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. 


సీఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు "ఆకస్మికమైనవి" అని, వాటిలో ఎటువంటి రాజకీయ పార్టీలు పాల్గొనలేదని, పోరాటాలు స్వచ్చందంగా జరుగుతున్నాయని నందితా దాస్ అన్నారు.


సీఎఎ, ఎన్‌ఆర్‌సిల రద్దు పై జరుగుతున్న ఉద్యమాలు విద్యార్థులు, సామాన్య ప్రజలు నడిపిస్తున్నారని, యువత చేస్తున్న పోరాటం ఒక ఆశను కలిగిస్తుందని, షహీన్ బాగ్ పోరాటం దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని, దేశంలోని మిగతా అన్నీ ప్రదేశాలు షాహీన్ బాగ్ మాదిరిగా అవ్వాలని, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలని నందితా దాస్ అన్నారు.


ప్రపంచవ్యాప్తంగా భారతదేశం చర్చనీయాంశంగా మారిందని, ఆర్థిక మందగమనంతో, పెరుగుతున్న నిరుద్యోగిత రేటుతో, సీఏఏ, ఎన్‌ఆర్‌సిలతో మతం ప్రాతిపదికన ప్రజలు విభజించబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 


గత 50 సంవత్సరాలలో ఈ రకమైన నిరుద్యోగాన్ని ఎప్పుడూ చూడలేదని, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని, అంతర్జాతీయ వార్తాపత్రికలు సైతం ఈ అంశాలపై దుమ్మెత్తి పోస్తున్నాయని ఆమె వాపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..