ముస్లిములు కూడా అయోధ్యలో రామమందిరమే కట్టాలంటున్నారు: యూపీ డిప్యూటీ సీఎం
ఈ రోజు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు అనేకమంది ముస్లిములు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో తమ ఆలోచనలను గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు
ఈ రోజు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు అనేకమంది ముస్లిములు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో తమ ఆలోచనలను గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు. "అందరు రామభక్తుల్లాగే నాకు కూడా అయోధ్యలో రామ మందిరం కడితే బాగుంటుందన్న ఆలోచన ఉంది. కానీ ప్రస్తుతం ఆ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాలి. మేము తీర్పు కోసం ఎదురు చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కూడా రామ మందిరం ఏర్పాటు పట్ల సుముఖతతో ఉంది. ఇది రాజకీయ ఇష్యూ కానేకాదు. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం" అని అన్నారు కేశవ్ ప్రసాద్ మౌర్య.
అయితే కాంగ్రెస్ ఇదే విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని మౌర్య అన్నారు. "మేము రామ మందిరం ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పాస్ చేయాలంటే లోక్ సభలో మొత్తం మెజారిటీ ఉంది. కానీ..రాజ్యసభలో మాకు అంత మెజార్టీ లేదు. అయినప్పటికీ అనేకమంది ముస్లిములు రామమందిరం నిర్మాణానికి అంగీకరిస్తారనే అనుకుంటున్నాం. కేవలం, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ బిల్లు పాస్ అవ్వకుండా ఉండాలని ఉంది" అని మౌర్య అన్నారు.
కేంద్రంలో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ రామమందిరం కట్టాలన్నది ప్రధాన డిమాండ్. బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ కోసం ఏర్పాటైన లిబ్రహాన్ కమిటీ ఇప్పటి వరకు 400 సార్లు సమావేశమై మొత్తం 101 మందిని విచారించింది.