పాకిస్తాన్ కావాలని జిన్నా కోరుకోలేదు: ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం భారత్-పాకిస్థాన్ విభజనపై విస్మయం గొలిపే వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం భారత్-పాకిస్థాన్ విభజనపై విస్మయం గొలిపే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, జిన్నా భారత్‌ను విభజించి, పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని కోరుకోలేదని ఏఎన్ఐతో అన్నారు. ముస్లింలు, సిక్కులు, ఇతర మైనారిటీ వర్గాలకు విశేష అధికారాలు ఇచ్చిన కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోవటానికి మొహమ్మద్ అలీ జిన్నా అనుకూలంగా ఉన్నారని.. ఆ సమయంలో, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్ మైనారిటీలకు విశేష అధికారాలు ఇవ్వడానికి నిరాకరించారని, ఆ తరువాతే దేశాన్ని విభజించవలసి వచ్చిందని అన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా శాంపిల్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- 'మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఏర్పాటుకు అనుకూలంగా లేరు. హిందూస్థాన్‌ని విభజించడానికి బదులుగా, ముస్లింలకు ప్రత్యేక నాయకత్వం ఉండాలని కమిషన్‌లో నిర్ణయించారు. అంతేకాదు మైనార్టీలకు, సిక్కులకు ప్రత్యేక వ్యవస్థ ఉండేలా నిర్ణయించారు. ఈ కమిషన్ చెప్పిన నిర్ణయాలకు జిన్నా అంగీకరించారు. కానీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్ అందుకు అంగీకరించలేదు. తర్వాత జిన్నా పాకిస్తాన్ డిమాండ్ కు కట్టుబడి ఉన్నారు' అని అన్నారు.
పాకిస్తాన్ విషయంలో నెహ్రూ, మౌలానా ఆజాద్, పటేల్ నిర్ణయం తీసుకోవడంలో తప్పుచేసి ఉండకపోయి ఉంటే.. పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ ఏర్పడేవి కావు. మూడు దేశాలు ఒకే దేశంగా ఉండేవన్నారు.
రాహుల్‌కి కొంత సమయం కావాలి: ఫరూక్ అబ్దుల్లా
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, 'నేను ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాహుల్ గాంధీ విజయాన్ని లేదా వైఫల్యాన్ని అంచనా వేయలేను. రాహుల్ కొన్ని రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పార్టీకి సంబంధించిన ప్రతిదీ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రజా ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటే.. మళ్లీ అధికారంలోకి వస్తుంది' అని అన్నారు