రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం పూర్తయింది. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత అజయ్‌ పిరమల్‌ తనయుడు ఆనంద్‌ పిరమల్‌‌తో ఇషాకు నిశ్చితార్థం జరిగింది. ఆనంద్ పిరమల్ ప్రస్తుతం పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వుండటంతోపాటు సంస్థ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్నాడు. పిరమల్ వ్యాపారంలోకి పూర్తి స్థాయిలో రావడానికి ముందుగా పిరమల్ ఈ-స్వాస్థ్య పేరుతో ఆనంద్ ఓ స్టార్టప్‌ను కూడా ఏర్పాటు చేశాడు. మహాబలేశ్వరంలోని ఓ దేవాలయంలో ఆనంద్, ఇషాకు ప్రపోజ్ చేసిన చోటే ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి వీళ్ల పెళ్లి ముహూర్తం తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాబలేశ్వరంలోని ఓ దేవాలయంలో జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు ఇరువురి తల్లిదండ్రులు నితా అంబాని, ముఖేశ్ అంబాని, స్వాతి, అజయ్ పిరమల్, ఇషా అంబాని గ్రాండ్ పేరెంట్స్ కోకిలాబెన్ అంబాని, పూర్ణిమబెన్ దలాల్, ఇషా సోదరులు ఆకాశ్ అంబాని, అనంత్ అంబానీ, ఆనంద్ పిరమల్ సోదరి నందిని, పీటర్, అన్య, దేవ్, తదితరులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆనంద్.. హార్వార్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. పిరమల్ రియల్టీ పేరుతో మరో సంస్థను సైతం స్థాపించిన ఆనంద్ పిరమల్.. దేశంలోని యువ వ్యాపారవేతల్లో ఒకరిగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఇషా అంబాని విషయానికొస్తే, రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఇషా ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి ఆమె ఎంబీఏ డిగ్రీ పూర్తవుతుంది.  


ఇషా అంబాని సోదరుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుండగా అంతకన్నా ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరగనుందని తెలుస్తోంది.