లోక్ సభను ఆశ్చర్యంలో ముంచెత్తిన ములాయం సింగ్ యాదవ్ ప్రకటన
లోక్ సభను ఆశ్చర్యంలో ముంచెత్తిన ములాయం సింగ్ యాదవ్ ప్రకటన
న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు, శాశ్వత మిత్రులు వుండరు అనేది పాత నానుడి. అది నిజమేనని నిరూపిస్తూ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోక్ సభలో ఓ ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే మరోసారి దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు ప్రకటించి ములాయం సింగ్ యాదవ్ తన మనసులో మాటను బయటపెట్టారు. బీజేపిని ఓడించేందుకు ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓవైపు తమ బద్ధశత్రువైన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)తోనూ జతకట్టగా మరోవైపు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఇలా ప్రధాని నరేంద్ర మోదీని కీర్తించడం సభలో వున్న వాళ్లందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తింది.
యూపీఏ అధినేత్రి సోనియా గాంధీకి పక్కనే నిలుచుని ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేస్తుండగానే.. ప్రధాని మోదీ ఆయనవైపు నవ్వుతూ చూస్తూ అందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా రెండు చేతులు జోడించి నమస్కరించారు. బుధవారం లోక్ సభలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికరమైన పరిణామం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశంగా మారింది.