సినీ నటి హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
నేపాల్ నటి మీనాక్షి థాపా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులకు ముంబయి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
నేపాల్ నటి మీనాక్షి థాపా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులకు ముంబయి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2012లో యూపీలో హిందీ చిత్రాలలో నటించడానికి వచ్చిన మీనాక్షి థాపాని అమిత్ కుమార్ అనే జూనియర్ ఆర్టిస్టు తన గర్ల్ ఫ్రెండ్ ప్రీతి సురిన్‌తో కలిసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. మీనాక్షి తొలిసారిగా అమిత్ కుమార్‌ని మధుర్ భండార్కర్ చిత్రం "హీరోయిన్" సెట్స్‌లో కలిసింది.
అయితే మీనాక్షి నేపాల్‌లో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుసుకున్న అమిత్ తన స్నేహితురాలితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని భావించారు. అనుకున్న విధంగానే భోజ్ పూరీ సినిమాల్లో అవకాశం ఇస్తామని నమ్మబలికి మీనాక్షిని గోరఖ్ పూర్ తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే వారు అంత మొత్తం చెల్లించకపోవడంతో మీనాక్షిని హతమార్చారు. తర్వాత తలను, మొండాన్ని వేరు చేశారు. తలను ఓ గుడ్డలో చుట్టి బస్సు నుండి బయటకు విసిరివేయగా.. మొండాన్ని ఓ వాటర్ ట్యాంకులో దాచిపెట్టారు
ఇటీవలే విచారణకు వచ్చిన ఈ కేసులో ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. అమిత్ తన స్నేహితురాలితో కలిసి మీనాక్షిని హతమార్చాక ఆమె సిమ్ కార్డునే వాడుతూ ఆమె తల్లికి మెసేజ్‌లు పంపేవాడు. అలాగే మీనాక్షి ఏటీఎం కార్డులు ఉపయోగించుకొని డబ్బులు డ్రా కూడా చేసుకొనేవాడు. అయితే అవే కార్డులను ట్రాక్ చేసిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు బాంద్రా ప్రాంతంలో పట్టుకున్నారు.
ఈ కేసును విచారణకు స్వీకరించిన స్పెషల్ టీమ్ దాదాపు 35 మంది సాక్షుల నుండి వివరాలు సేకరించారు. అందులో నిందితుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎంక్వయరీలో నేరస్తులు డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని మట్టుబెట్టారని తేల్చారు. ఈ కేసులో నేరస్తులు ఉద్దేశపూర్వకంగా.. ఎలాంటి జాలి, దయ, కరుణ లేకుండా హత్య చేశారు కాబట్టి వారికి జీవిత ఖైదు విధించాలని కోర్టు తెలిపింది