గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్ చిట్
గుజరాత్ గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల కేసు(Godhra riots case) నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి విముక్తి లభించింది. దీనిపై దర్యాప్తు చేసిన జస్టిస్ నానావతి - మెహతా కమిషన్(Nanavati commission) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదికను బుధవారం గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది.
అహ్మెదాబాద్: గుజరాత్ గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల కేసు(Godhra riots case) నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి విముక్తి లభించింది. దీనిపై దర్యాప్తు చేసిన జస్టిస్ నానావతి - మెహతా కమిషన్(Nanavati commission) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదికను బుధవారం గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. గుజరాత్ హోం మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన పరిణామాలతో అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నివేదిక స్పష్టంచేసింది. అప్పట్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు(Sabarmati Express train) దహనం తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించిన నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. ఎస్-6 కోచ్‌లో సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఐతే దీన్ని నిరాధారమైన ఆరోపణలుగా జస్టిస్ నానావతి, మెహతా కమిషన్ నిర్ధారించింది. అంతే కాదు.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఘటనా స్థలానికి వెళ్లారన్న ఆరోపణలనూ కమిషన్ తోసిపుచ్చింది. ఐతే జస్టిస్ నానావతి, మెహతా కమిషన్ నివేదిక ఇచ్చిన ఐదేళ్ల తర్వాత నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.
2002 ఫిబ్రవరి 27న గుర్తుతెలియని అల్లరి మూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పుపెట్టాయి. ఫలితంగా రైలులోని ఎస్-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటనపై నాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోదీ రాజధర్మం పాటించలేదన్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ఆఫీసర్లు ఆర్బీ శ్రీకుమార్, సంజీవ్ కుమార్ భట్, రాహుల్ శర్మకు కూడా జస్టిస్ నానావతి, మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.