3 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు.. మోదీ సర్కార్ మెగా ప్లాన్
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మెగా ప్లాన్
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువతను ఆకట్టుకునే రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ ఉపాధి కల్పనపై భారీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 14 మెగా నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్స్ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మెగా నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్స్ ఏర్పాటు ద్వారా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1 కోటి ఉద్యోగాలు కల్పించాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఈ 14 మెగా నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్స్ ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ. 1 లక్ష కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి కేంద్రం నీతి ఆయోగ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సదరు వార్తా కథనం పేర్కొంది. అంతేకాకుండా 2019 లోక్ సభ ఎన్నికల నగరా మోగడానికన్నా ముందుగానే ఈ ప్రతిపాదనను అమలులోకి తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా సదరు వార్తా కథనం స్పష్టంచేసింది.
గడిచిన నాలుగేళ్లలో ఉపాధి కల్పన కోసం కేంద్రం చేసిందేమీ లేదని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విపక్షాల నోళ్లు మూయించేందుకు కేంద్రం ఈ ప్రాజెక్టుని తెరపైకి తీసుకొస్తున్నట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, అనేక సందర్భాల్లో ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన కేంద్రం.. గత నాలుగేళ్లలో ఉపాధి కల్పన కోసం కేంద్రం తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తూనే ఉంది.