న్యూఢిల్లీ: 2018 చివర్లో రాజకీయంగా తీవ్ర చర్చనియాంశమైన అంశాల్లో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం కూడా ఒకటి. దేశ ఆర్థిక స్థితిగతులను సరిదిద్దలేని నిస్సహాయ పరిస్థితుల్లోనే మెధావి అయ్యుండి కూడా ఉర్జిత్ పటేల్ ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ సహా ఎన్డీఏకి ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆరోపించాయి. అయితే, అప్పట్లో ఆయన మాత్రం తాను తన వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం సైతం ప్రస్తావనకు రాగా ఆయన మరో ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. 


ఉర్జిత్ పటేల్ రాజీనామాకు వ్యక్తిగత కారణాలే తప్ప ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మరోమారు స్పష్టంచేసిన ప్రధాని మోదీ.. గత 6-7 నెలలుగా రాజీనామా అంశం గురించి ఉర్జిత్ పటేల్ తనతో చెబుతూ వచ్చారని, మొదటిసారి తాను ఈ విషయాన్ని బయటికి వెల్లడిస్తున్నానని అన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని భావిస్తున్నట్టుగా రాతపూర్వకంగా సైతం విజ్ఞప్తి చేసుకున్నారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ మంచి ప్రతిభ కనబర్చారని మోదీ కొనియాడారు.