మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదిన ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేకమంది ప్రముఖులకు, సెలబ్రిటీలకు తానే స్వయంగా లేఖలు రాశారు. అందులో పలువురు సినీ నటులకు కూడా చోటు దక్కింది. తెలుగు సినీ నటులు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌‌తో పాటు సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్‌, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటీమణులు అనుష్క శెట్టి, సమంత అక్కినేని, కాజల్‌ అగర్వాల్‌‌లు కూడా ఈ లేఖను అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరిశుభ్ర భారత్‌ నిర్మాణానికి అందరూ సహకరించాలని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశం.. పరిశుభ్ర భారతదేశమని మోదీ తెలిపారు. ఈ పరిశుభ్ర భారతదేశం గురించి ప్రచార కార్యక్రమమే " స్వచ్ఛతా హీ సేవా" కార్యక్రమమని తెలిపారు. మోదీ ఇంకా అనేక మందికి లేఖలు పంపించారు. అందులో బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఇంకా లతా మంగేష్కర్, ఏఆర్ రెహమాన్ మొదలైనవారికి కూడా ప్రధాని లేఖలు రాశారు. 


" స్వచ్ఛతా హీ సేవా" కార్యక్రమాన్ని విజయవంతం చేసి గాంధీజీకి సరైన రీతిలో నివాళులు అర్పిద్దామని మోదీ తెలిపారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పనిచేస్తున్న వారందరికీ తన ధన్యవాదాలని తెలిపిన మోదీ..స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, మహిళలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, నెహ్రు యువకేంద్రం వాలంటీర్లు, హౌసింగ్ సొసైటీల నిర్వాహకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సంస్థల ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.