చత్తీస్‌ఘడ్‌లో రేపు తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇవాళ ఆదివారం దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల కదలికలను గుర్తించినట్టు అక్కడి భద్రతా బలగాలు తెలిపాయి. చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు దంతెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కనిపించాయి. ఓ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న దృశ్యాన్ని డ్రోన్ కెమెరాలు చిత్రీకరించాయి. 


తొలి దశ ఎన్నికల్లో భాగంగా 8 జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా అందులో 18 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. దీనికితోడు తాజాగా మావోయిస్టుల కదలికలు వెలుగుచూడటంతో బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. దంతెవాడలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతోంది. రేపు ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి.