ఎన్‌సీసీ అంటే ఏంటో నాకు తెలియదు: రాహుల్ గాంధీ
కర్ణాటకలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చిత్రమైన అనుభవం ఎదురైంది.
కర్ణాటకలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చిత్రమైన అనుభవం ఎదురైంది. తన ప్రసంగమయ్యాక విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాహుల్ గాంధీ ఓ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయారు. "ఎన్‌సీసీ క్యాడెట్లు కళాశాల స్థాయిలోనే ఎంతో కష్టపడతారు.. వారు 'సీ' సర్టిఫికెట్ పొందితే ఎంతో ఆనందిస్తారు.
ఎన్‌సీసీ క్యాడెట్లకు మీ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు ఇవ్వాలని భావిస్తుంది" అని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేకపోయారు. ఎన్‌సీసీ గురించి తనకు అవగాహన లేదని.. ఆ ట్రైనింగ్ విషయాలు కూడా తనకు తెలియవని ఆయన అన్నారు. అందుకే ఆ ప్రశ్నకు తాను సమాధానమివ్వలేనని ఆయన చెప్పారు. అయితే విద్యార్థులకు మంచి విద్యను అందివ్వడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
అయితే రాహుల్ గాంధీ సమాధానం ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎందరో విద్యార్థులకు కోపం తెప్పించింది. "ఎన్‌సీసీ దేశానికి రెండో ఆర్మీ లాంటిది. భారతదేశంలో దాదాపు 15 లక్షల ఎన్‌సీసీ క్యాడెట్లు ఉన్నారు. భారతదేశానికి వారందరూ గర్వకారణం. అటువంటి విద్యార్థుల దళం గురించి రాహుల్‌జీకి కనీసం అవగాహన ఉంటే మేము సంతోషించేవాళ్లం" అని పలువురు ఎన్‌సీసీ క్యాడెట్‌లు అన్నారు.