బల పరీక్షపై సుప్రీం ఆదేశాలు.. స్పందించిన ఎన్సీపీ
మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra assembly)లో రేపే బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన పిటిషనర్లలో ఒకరైన ఎన్సీపీ(NCP) స్పందించింది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra assembly)లో రేపే బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన పిటిషనర్లలో ఒకరైన ఎన్సీపీ(NCP) స్పందించింది. సుప్రీం కోర్టు తీర్పు(Supreme court verdict)పై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు భారత ప్రజాస్వామ్యంలో ఓ మైలు రాయి లాంటిదని అన్నారు. రేపు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బీజేపి ఆట ముగిసిపోనుందని జోస్యం చెప్పిన నవాబ్ మాలిక్.. రానున్న కొద్ది రోజుల్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో కలిసి బీజేపి నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27న బల పరీక్ష చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బలబలాలు నిరూపించడం రాజ్ భవన్ విధి కాదని.. అది తేల్చుకోవాల్సింది అసెంబ్లీలోనే అని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.