ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ పరీక్షలు
జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షకు ఎప్పుడైనా ఒకసారి హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తామన్నారు.
యూజీసీ నీట్, జేఈఈ, నెట్, సీమ్యాట్ పరీక్షలను ఇక నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నది. నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను డిసెంబర్‌లో, జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో, నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు పరీక్ష కోసం కంప్యూటర్ సెంటర్లలో ప్రాక్టీసు చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.