కాశ్మీర్ పోలీసుల భద్రతకు కొత్త స్కీమ్
జమ్ము కాశ్మీర్ పోలీసులకు భద్రతను కల్పించడానికి భారత ప్రభుత్వం ఓ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జాకెట్స్ అందివ్వాలని నిర్ణయించింది. తీవ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్న ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల భద్రత కోసం సర్కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. కాశ్మీర్ లోయలో ఈ సంవత్సరం తీవ్రవాదుల దాడిలో దాదాపు 26 పోలీసులు అసువులు బాసారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అన్ని పోలీస్ స్టేషన్లకు మంజూరు చేసింది. వీటితో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, టోపీలు కూడా పోలీసు యంత్రాంగానికి సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. కాశ్మీర్ ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం రూ.500కోట్ల నిధులను కేటాయించాలని భావిస్తున్నట్లు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే.