నీరవ్ మోదీకి చెందిన రూ. 637 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
పీఎన్‌బీ కేసు: నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలాది కోట్లు మోసగించి విదేశాలకు వెళ్ళిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. నీరవ్ మోదీకి సంబంధించిన సుమారు రూ.637కోట్ల విలువైన విదేశీ ఆస్తులను సోమవారం ఈడీ జప్తు చేసింది.
'పీఎన్‌బీ మోసాలకు పాల్పడినందుకు భారతదేశంలో, నాలుగు ఇతర దేశాల్లో నీరవ్ మోదీకి ఉన్న రూ.637 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది' అని ఒక సంబంధిత అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకి తెలిపారు. 637 కోట్ల రూపాయిల విలువ చేసే భవనాలు, బ్యాంకు అకౌంట్లు, డైమండ్ ఆభరణాలను ఈడీ జప్తు చేసింది.
న్యూయార్క్‌లో ఉన్న 216 కోట్ల రూపాయిల విలువ చేసే రెండు ఆస్తులను, 278 కోట్ల రూపాయిల విలువ చేసే విదేశాల్లో ఉన్న 5 బ్యాంకు అకౌంట్లను, 22.69 కోట్ల విలువ చేసే ఆభరణాలను ఈడీ జప్తు చేసింది. ఆభరణాలను హాంగ్‌కాంగ్ నుంచి భారత్‌కు తరలించారు ఈడీ అధికారులు. దక్షిణ ముంబైలో ఉన్న 19.5 కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్‌ను కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటినీ మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 5 కింద జప్తు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
'నీరవ్ మోదీ లాంటి వ్యక్తులను భారతదేశానికి తిరిగి రప్పించటానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అప్పగింత విషయమై నికరాగ్వా దేశాధ్యక్షుడితో మాట్లాడారు' అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు.