నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీలు ఖరారయ్యాయి. దీంతో దోషులు .. తీహార్ జైలులో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి .. లేదా.. కేసును ఇంకా సాగదీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగానే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు.  ఉరి శిక్ష తేదీలను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత .. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. తలను గోడకు కొట్టుకున్నాడు. చేతులను జైలు ఊచల మధ్య పెట్టి .. తనను తానే గాయపరచుకున్నాడు. ఉరి శిక్ష తేదీలు దగ్గరపడుతున్న కారణంగా .. శారీరకంగా ఫిట్ గా లేకుండా చేయడం కోసమే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే అతన్ని నిత్యం  గమనిస్తున్న తీహార్ పోలీసులు .. వెంటనే ఆస్పత్రికి పంపించి ప్రథమ చికిత్స చేయించారు. కానీ రోజూ అలాగే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. 


ఇప్పుడు  ఉరి శిక్ష అమలును మరికొద్ది రోజులు వాయిదా వేయించుకోవడం కోసం..  మరో ట్రిక్ మొదలు పెట్టాడు. ఈసారి మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. తనకు మానసిక స్థితి సరిగా లేదని .. మానసిక వైద్యం చేయించేలా తీహార్  అధికారులను ఆదేశించాలని పిటిషన్ పెట్టుకున్నాడు. ఐతే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. తీహార్ జైలు అధికారులకు ఓ నోటీసు పంపించింది. ఓ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.  అంతే కాదు  ఈ పిటిషన్ ను కోర్టు .. ఈ నెల 22న విచారణ చేయనుంది.