ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేడే ఎన్డిఏ సర్కార్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఓ మహిళా మంత్రి నేడు కేంద్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. అవును, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2019-20 ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే 90-120 నిమిషాలపాటు ఈ ప్రసంగం కొనసాగనుంది. 


నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిన్ననే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రీ-బడ్జెట్ ఎకనమిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ? దేశం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటనే అంశాలను ఈ ఎకనమిక్ సర్వే ద్వారా ప్రభుత్వం దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2019-20పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.