BIHAR POLITICS:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. మోడీ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ, బీజేపీ చీలక రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్డడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం సాగింది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వారం రోజులు ఉన్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాలపై చర్చించడానికే కేసీఆర్ ఢిల్లీకే వెళ్లారనే చర్చ సాగింది. కాని వారం రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒక్కరే కలిశారు. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై విపక్షాలు సెటైర్లు వేశాయి. ఢిల్లీలో వారం రోజులు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించాయి. అయితే తాజాగా బీహార్ లో జరిగిన రాజకీయ పరిణామాలతో కొత్త చర్చ సాగుతోంది. బీహార్ రాజకీయాల వెనుక కేసీఆర్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రంలో శివసేనను చీల్చి బీజేపీతో కలిసిపోయారు ఏక్ నాథ్ షిండే. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్ర పరిణామాల తర్వాత పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణలోనూ షిండే వస్తారన్నారు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోనూ షిండేలు పట్టుకొస్తారని కామెంట్లు చేశారు. బీజేపీ నేతల షిండే ప్రకటనలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.  తెలంగాణలో అంత సీన్ లేదన్నారు. ధమ్ముంటే చేసి చూపించాలని బీజేపీకి సవాల్ చేశారు. ఇంతలోనే బీహార్ లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.  మహారాష్టలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ను పడగొట్టామన్న జోష్ లో ఉన్న కమలనాధులకు బీహార్ లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎన్డీఏకు హ్యాండిచ్చారు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెగతెంపులు చేసుకుని నితీశ్ కుమార్ ఎందుకు బయటికి వచ్చారన్నది చర్చగా మారింది. అయితే బీహార్ లో బీజేపీకి బైబై చెప్పిన నితీశ్,, తేజస్వీ యాదవ్  తో కలిసిపోవడం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేసీఆర్.. మహారాష్ట్ర పరిణామాల తర్వాత బీహార్ ముఖ్యమంత్రిని అలర్ట్ చేశారని తెలుస్తోంది. నితీశ్ కుమార్ తో కేసీఆర్ మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతలు తరుచూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. బీహార్ లో బీజేపీ కన్న తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే నితీశ్ కు తెలియకుండానే జేడీయూ నేత ఆర్ఎస్పీ సింగ్ ను ఇటీవలే కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంది. ఈ విషయంలో బీజేపీ తీరుపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత నితీష్ కు ఫోన్ చేసి కేసీఆర్ అలర్ట్ చేశారని అంటున్నారు. ఆ తర్వాత బీజేపీ పై నితీశ్ వైఖరి మారిపోయింది. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. రెండేళ్ల తర్వాత జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రుల్లో కేసీఆర్, నితీశ్ ఇద్దరే హాజరుకాలేదు. నీతి ఆయోగ్ సమావేశం జరిగిన కొన్ని గంటల్లోనే ఎన్డీఏకు గుడ్ బై చెప్పేశారు నితీశ్ కుమార్. దీంతో బీహార్ రాజకీయ మార్పుల వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ తో అఖిలేశ్ యాదవ్ సుదీర్గంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య బీహార్ రాజకీయాల గురించి చర్చ జరిగిందని అంటున్నారు. ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ .. అఖిలేశ్ యాదవ్ కు దగ్గరి బంధువు. అంతేకాదు జనవరిలో తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. బీహార్ లో నితీష్ ను బీజేపీ టార్గెట్ చేయబోతుందని గ్రహించిన కేసీఆర్.. తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్ తో మాట్లాడి.. నితీశ్ కు దగ్గరయ్యేలా చేశారనే ప్రచారం సాగుతోంది. బీహార్ రాష్ట్రంలో బీజేపీ రహిత ప్రభుత్వం ఏర్పాటు కావడంలో  కేసీఆర్ కీలకంగా వ్యవహారించారని.. కేసీఆర్ దెబ్బకు బీహార్ లో బీజేపీ కుదేలైందని ఉత్తరాది మీడియాలో వార్తలు వచ్చాయి.


ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ కు చెందిన పీకే గతంలో జేడీయూకి వ్యహకర్తగా పని చేశారు. నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ కు కీలక పదవి ఇచ్చారు నితీశ్ కుమార్. కొంత కాలానికే జేడీయూకు రాజీనామా చేసి బయటికి వచ్చారు ప్రశాంత్ కిషోర్. అయితే జాతీయ స్థాయిలో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. గత బెంగాల్ ఎన్నికల్లో మమతకు వ్యూహకర్తగా పని చేసి ఆమె మరోసారి విజయం సాధించడంలో పీకే కీలక పాత్ర పోషించారు. మమత డైరెక్షన్ లోనే బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా పీకే ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. మమతా బెనర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో మమత, కేసీఆర్, పీకే  డైరెక్షన్ లోనే బీహార్ లో బీజేపీకి షాక్ ఇస్తూ ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా బీజేపీ టార్గెట్ గా జాతీయ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్.. బీహార్ లో తొలి దెబ్బ కొట్టారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. 


Also Read : Munugode Byelection: రేవంత్ రెడ్డికి పాల్వాయి స్రవంతి వార్నింగ్.. మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి


Also Read : Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు బీమా నమోదు గడువు పెంపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook