ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తోన్న ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీలాంటి మరో నేత పుట్టుకు రాకుండా ఇకపై తగిన జాగ్రత్త పడతానని కేజ్రీవాల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్నా హజారే. 


దేశ వ్యాప్తంగా వున్న రైతన్నలకు సంక్షేమం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 23వ తేదీ నుంచి శాంతియుత నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్న అన్నా హజారే ఇవాళ ఉదయం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసే ఉద్యమాల నుంచి మరో అరవింద్ కేజ్రీవాల్ పుట్టుకురాకుండా జాగ్రత్తపడతానని అన్నారు. ''అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమంలో చేరిన సమయంలో తాను తగినంత జాగ్రత్త వహించలేదు. కానీ ఇకపై తనతో కలిసివచ్చే వాళ్లందరి వద్ద నుంతి తాను ఓ అఫిడవిట్ తీసుకుంటాను. భవిష్యత్‌లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం కానీ లేదా రాజకీయాల్లో చేరడం కానీ జరగదు" అని ఆ ఆఫిడవిట్‌లో పేర్కొన్న వారిని మాత్రమే తాను తన ఉద్యమంలో చేర్పించుకుంటాను అని అన్నా హజారే స్పష్టంచేశారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో చేసిన తప్పు మరొకసారి చేయను అని కేజ్రీవాల్‌పై నేరుగానే విమర్శలు సంధించారు అన్నా హజారే.