పెట్రోల్, డీజిల్ ధరలు పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బీహార్ వంటి పలు రాష్ట్రాల్లో భారత్ బంద్‌లో భాగంగా జరిగిన ఆందోళనలల్లో నిరసనకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 పార్టీలు ఈ భారత్ బంద్ లో పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఈ భారత్ బంద్ ఆందోళనలకు పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అయితే, దేశవ్యాప్తంగా ఓవైపు ఆందోళనలో జరుగుతోంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మౌనం వహిస్తున్నారని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. 


రాహుల్ గాంధీ విమర్శల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంధనం ధరల పెంపులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదని అన్నారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసునని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.