అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్‌ని అడ్డుకునే శక్తి ఎవ్వరికి లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. అలా కాకుండా రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేశారంటే, వాళ్లు సమాజంలో అశాంతిని కోరుకుంటున్నారనే అర్థం అని నితీష్ అభిప్రాయపడ్డారు. గయలో బుధవారం తమ జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ విభాగాల కార్యకర్తలతో జరిగిన సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఎవరైతే, రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో.. వాళ్లెవ్వరూ రిజర్వేషన్ల సాధనలో భాగం పంచుకున్న వాళ్లు కాదు. అటువంటప్పుడు అంబేద్కర్ ఎంతో కృషి చేసి తీసుకొచ్చిన రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. రిజర్వేషన్ల కొనసాగింపు కోసం అవసరమైతే ఏ త్యాగమైనా చేయడానికి తనలాంటి వాళ్లు ఎందరో సిద్ధంగా ఉన్నారు అని నితీష్ స్పష్టంచేశారు. 


2006లో గ్రామ పంచాయతి ఎన్నికల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని చెబుతూ.. మహిళలకు సైతం 50శాతం కోటాను అమలు చేసిన విషయాన్ని నితీష్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.