ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది మీడియానే అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. 'కొన్ని మీడియా సంస్థలు ఉత్తర కర్ణాటక అంశాన్ని పనిగట్టుకొని ప్రచారం చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. మీరు ఇలాంటి వార్తలు ప్రసారం చేయకండి' అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్తర కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు కర్ణాటకలోని 13 జిల్లాలను విడగొట్టి ఉత్తర కర్ణాటక పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరింత ఊపందుకుంది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆగస్టు 2వ తేదీన కర్ణాటకలోని 13 జిల్లాల బంద్‌కు ఆ ప్రాంతంలోని నాయకులు పిలుపునిచ్చారు. ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే తమ ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని ఉత్తర కర్ణాటక రాష్ట్ర పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 2న తలపెట్టిన ఉత్తర కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వకూడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి.


కాగా, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి పదవుల పంపకం, అభివృద్ధి, నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కర్ణాటక పోరాట సమితి చీఫ్ భీమప్ప గదద్ తెలిపారు.