ప్రయాణీకులు రైళ్లలో తీసుకెళ్ళే సామాన్ల(లగేజ్)పై నియంత్రణ విధించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. పరిమితికి మించి లగేజీని వెంట మోసుకెళ్తే.. జరిమానా తప్పదు! ఈ మేరకు లగేజ్ బరువుకు సంబంధించిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల కంటే అదనపు లగేజీతో బోగీలు నిండిపోతున్నాయని ఇటీవల ఫిర్యాదులు రావడంతో రైల్వే శాఖ ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణికులు 40 కిలోల లగేజీని, సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికులు 35 కిలోల లగేజీని ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా తమ వెంట తీసుకెళ్లేందుకు రైల్వే అనుమతిస్తోంది. కాగా ఈ కొత్త నిబంధన ప్రకారం.. అంతకన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్ళాలంటే సాధారణ చార్జీల కన్నా ఆరు శాతం ఎక్కువ జరిమానాగా చెల్లించి తీసుకువెళ్లాలి. సదరు అదనపు సామానును నిర్దేశిత బోగీలో ఉంచాలి. త్వరలోనే ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.


పర్యావరణహిత ప్లేట్లలో భోజనం


పాలీమర్లతో తయారైన ప్లేట్లకు బదులుగా.. చెరకు పిప్పితో చేసిన పర్యావరణహిత ప్లేట్లలో ప్రయాణికులకు భోజనాలు అందించే కార్యక్రమానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు శతాబ్ది, నాలుగు రాజధాని రైళ్లలో ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ.