జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలి : ఒమర్ అద్భుల్లా
ప్రస్తుత పరిణామాలపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్ధుల్లా
జమ్మూకాశ్మీర్ లో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకోవడంతో ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ లేని కారణంగా ముఖ్యమంత్రితోపాటు ఆ రాష్ట్ర కేబినెట్ సభ్యులు సైతం ఆ రాష్ట్ర గవర్నర్ నరిందర్ నాథ్ ఓహ్రాకు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. దీంతో ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వం లేకుండాపోగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదిలాఉంటే అక్కడి మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్ధుల్లా ప్రస్తుత పరిణామాలపై స్పందిస్తూ... జమ్మూకాశ్మీర్ లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి మెజారిటీ కట్టబట్టలేదు. 2018లోనూ పార్టీకి సరైన మెజారిటీ లేదు. మద్దతు కోసం ఇప్పటివరకు ఎవ్వరినీ సంప్రదించలేదు. ఇకపై స్పందించే ఆలోచన కూడా లేదు. అందుకే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక ప్రస్తుతం అందరి ముందున్న ఏకైక మార్గం తక్షణమే ఎన్నికలకు వెళ్లడం అని ఒమర్ అబ్ధుల్లా స్పష్టంచేశారు.
జమ్మూకాశ్మీర్ లో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25 స్థానాలు గెల్చుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండు నెలలకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత నెషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాల్లో గెలుపొందగా ఆ తర్వాత 12 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ చివరి స్థానంలో నిలిచింది.