మోదీ, అమిత్ షా ద్వయంపై బీజేపీ నేత ఫైర్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా పై శతృఘ్న సిన్హా విరుచుకుపడ్డారు. వారిద్దరినీ `ఒక వ్యక్తి ప్రదర్శన.. ఇద్దరు వ్యక్తుల సైన్యంగా` పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా పై శతృఘ్న సిన్హా విరుచుకుపడ్డారు. వారిద్దరినీ "ఒక వ్యక్తి ప్రదర్శన.. ఇద్దరు వ్యక్తుల సైన్యంగా" పేర్కొన్నారు. ఈ సైన్యం ఇంకా మితిమీరిన నమ్మకంతో ముందుకు వెళ్తుందని.. ఇంకో 50 సంవత్సరాలు భారతదేశాన్ని పాలిస్తాం అని చెబుతుందని తెలిపిన సిన్హా.. ఈవీఎంలు కంట్రోల్ చేయడం వల్ల అలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మాటలు అంటూనే ఆయన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.
రాజకీయాలు అస్థిరతతో ఉంటున్న క్రమంలో.. అఖిలేష్ ప్రయోజవంతమైన రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారని శతృఘ్న సిన్హా తెలిపారు. అఖిలేష్ తెగువ చూస్తుంటే ముచ్చటేస్తుందని.. ఆయన రాజకీయాల్లో సీరియస్ నెస్ ఉందని శతృఘ్న సిన్హా తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సిన్హా తెలియజేశారు. ఈ మధ్యకాలంలో రాఫెల్ డీల్ ఒప్పందాలపై కూడా శతృఘ్న సిన్హా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
2014లో బీజేపీ తరఫున గెలిచినప్పటికీ శతృఘ్న సిన్హా.. ఆ తర్వాత రెబల్‌గా మారారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా సిన్హా గళమెత్తుతున్నారని పలువురు నాయకులైతే బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో పాట్నా నుండి సిన్హాను పక్కన పెట్టి.. సుశీల్ కుమార్ షిండేకి పదవిని కట్టబెట్టాలని ఇప్పటికే బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో తనకు ఎవరు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా.. తాను మాత్రం మళ్లీ అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని శతృఘ్న సిన్హా ప్రకటించారు.