కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరో మూడు రాష్ట్రాల్లో గవర్నర్లకు తలనొప్పిని తీసుకొచ్చిపెట్టింది. కర్ణాటకలో అత్యధిక సీట్లు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా అవతరించింది అనే కారణంతో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, తమ తమ రాష్ట్రాల్లో తాము కూడా అత్యధిక సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు కర్ణాటకలో జరిగినదాని ప్రకారమే తమను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ గోవా, బీహార్, మణిపూర్ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్లని కలిశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవాలో గతేడాది జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హాను కలిశారు. 13 మంది పార్టీ నేతలతో సహా వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ని కలిసిన గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ చెల్ల కుమార్.. తమకు 7 రోజుల సమయం ఇస్తే, మెజార్టీని నిరూపించుకుంటామని విజ్ఞప్తి చేశారు. 


 



ఇదేతరహాలో బీహార్‌లో గతేడాది జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ తరుపున ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ వెళ్లి బీహార్ గవర్నర్ సత్యపాల్ యాదవ్‌ని కలిశారు. గత ఎన్నికల్లో ఆర్జేడీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ నేతలు సైతం తేజస్వి యాదవ్‌తో గవర్నర్‌ని కలిసిన వారిలో వున్నారు.


 



మణిపూర్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖిల్‌ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 


ఈ అనుకోని పరిణామాలతో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం వ్యాపిస్తున్నాయి.