`మోదీ ముక్త్ భారత్`కు పిలుపునిచ్చిన రాజ్ థాకరే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ‘మోదీ ముక్త్ భారత్’ కోసం పిలుపునిచ్చారు. ఆదివారం ముంబైలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. మోదీ ఫ్రీ ఇండియా కోసం విపక్షాలు ఏకం కావాలని కోరారు. 'మోదీ ఫ్రీ ఇండియా కావాలంటే అన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలి' అని అన్నారు. నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలతో దేశంలోని ప్రజలు విసుగెత్తినట్లు ఆయన చెప్పారు.
"భారతదేశం 1947లో తొలిసారి స్వాతంత్ర్యం పొందింది.1977లో రెండసారి (అత్యవసర ఎన్నికల తరువాత), 'మోదీ ముక్త్' ఫలిస్తే 2019 మూడోసారి భారతదేశం స్వాతంత్ర్యం పొందుతుంది' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అయోధ్య-బాబ్రీ వివాదం గురించి మాట్లాడుతూ, "అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే ఆయనకు ఉంది. కానీ దానిని రాజకీయ అస్త్రంగా ఉపయోగించరాదు" అని అన్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, సిబిఐ వంటి సంస్థలను నియంత్రించాలని చూస్తున్న ప్రభుత్వం మీడియాను తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని థాకరే ఆరోపించారు.
నీరవ్ మోదీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే శ్రీదేవి అంత్యక్రియలకు అంతలా హడావిడి చేశారని ఆరోపించారు. ‘శ్రీదేవి గొప్ప నటి కావచ్చు.. కానీ ఆమె దేశానికి ఏం సేవ చేశారు? ఆమె భౌతికాయంపై త్రివర్ణ పతాకం ఎందుకు ఉంచారు? అధికార లాంఛనాలతో జరిపించాల్సిన అవసరం ఏంటీ ? బీజేపీయేతర సీఎం ఇలా చేసివుంటే మీడియా గగ్గోలు పెట్టేది. మోదీ ప్రభుత్వం కాబట్టే భయపడి మీడియా నోరు మెదపడం లేదని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌పై కూడా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ‘అక్షయ్ భారతీయుడు కాదు. ఆయన పాస్‌పోర్టులో కెనడియన్‌గా ఉంది. వికీపిడియా కూడా ఆయనను భారత్‌లో పుట్టిన కెనడియన్‌గా చూపిస్తోంది. ఒకప్పటి నటుడు మనోజ్ కుమార్ అడుగుజాడల్లో నడవడానికి అక్షయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు' అని పేర్కొన్నారు.