ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు స్వాహా: ఆర్బీఐ
దేశంలోని వివిధ బ్యాంకుల్లో గత ఐదేళ్ల నుంచి సుమారు 23 వేల మోసాల కేసులు వెలుగు చూశాయట.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకుల్లో గత ఐదేళ్ల నుంచి సుమారు 23 వేల మోసాల కేసులు వెలుగు చూశాయట. వీటి విలువ రూ.లక్ష కోట్ల పైమాటేనని రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. 2016-17లో 5 వేల మోసాలు వెలుగు చూస్తే.. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 1, 2018 నాటికి అవే మోసాలు 5,152కు పెరిగాయని తెలిపింది. ఓ జాతీయ మీడియా ప్రతినిధి సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ పై విధంగా సమాధానంగా ఇచ్చింది.
అత్యధిక మోసాలు ఏప్రిల్ 2017 నుంచి మార్చి 1, 2018 వరకు జరిగాయని.. అందులో రూ.28,459 కోట్ల వరకు చేతులు మారాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2016-17లో రూ.23,933 కోట్ల గోల్‌మాల్ జరిగిందని.. ఈ లెక్కన మొత్తంగా ఐదేళ్లలో.. అంటే 2013 నుంచి మార్చి 1, 2018 వరకు సుమారు 23 వేల మోసాల కేసుల విలువ మొత్తం రూ.1 లక్ష కోట్లు కంటే ఎక్కువగానే తేలుతుందని ఆర్‌బీఐ సమాచారం అందించింది.
2013-14లో 4,306 మోసాల కేసుల్లో రూ.10,170 కోట్లు, 2015-16లో 4,693 కేసుల్లో రూ.18,698 కోట్లు, 2014-15లో 4,639 కేసుల్లో రూ.19,455 కోట్ల మోసాలు జరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ మోసాల కేసులపై ఆయా కేసుల తీవ్రతను బట్టి చర్య తీసుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. తాజాగా ఈ బ్యాంకు మోసాలు బహిర్గతం కావడంతో ఆర్బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే డిసెంబర్ 2017 నాటికి దేశంలోని బ్యాంకుల్లో రూ.8,40,958 కోట్లు మొండిబకాయిలుగా ఉన్నట్లు తేలింది. ఇందులో ఎస్బీఐ వాటా అత్యధికంగా రూ.2,01,560 కోట్లుగా తేలింది. పీఎన్‌బీఐలో రూ.55,200 కోట్లు, ఐడిబీఐలో రూ.44,542 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ.43,471 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.41,649 కోట్లు, యూనియన్ బ్యాంకులో రూ.38,047 కోట్లు, కెనెరా బ్యాంకులో రూ.37,794 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకులో రూ.33,849 కోట్ల బకాయిలు ఉన్నట్లు మార్చి 9వ తేదిన లోకసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా తెలిపారు.