చెన్నై: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్‌లో కేవలం ముస్లింల ఆధిపత్యం అధికంగా ఉన్నందుకే బీజేపీ అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, అలా కాకుండా ఒకవేళ కశ్మీర్‌లో హిందువుల జనాభా అధికంగా ఉండి ఉంటే బీజేపి ఆ అధికరణం జోలికే వెళ్లేది కాదని పి చిదంబరం ఆరోపించారు. కండబలంతో 370 అధికరణను రద్దు చేసిన వారికి అక్కడి 72 ఏళ్ల చరిత్ర గురించి తెలియదని చిదంబరం అన్నారు. అన్నింటికిమించి ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ బీజేపి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఏడు పార్టీలు మద్దతివ్వడం తనకు బాధ కలిగించిందని చెబుతూ.. తమిళనాడు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాతంగా మారిస్తే తమిళ ప్రజలు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా? అని చిదంబరం ప్రశ్నించారు.


జమ్ముకశ్మీర్ పట్ల బీజేపి సర్కార్ వైఖరిని తప్పుపట్టిన చిదంబరం.. జమ్మూకాశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేననే విషయంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఒకవేళ అనుమానం అంటూ ఏదైనా ఉండి ఉంటే అది బీజేపీకే ఉండాలి అని ఎద్దేవా చేశారు.