రాజస్థాన్ చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన మహిళలు "పద్మావత్" నిర్మాత, దర్శకులకు సవాలు విసిరారు. తమ మనోభావాలను దెబ్బ తీసేవిధంగా సినిమా రూపొందించారని.. ఒకవేళ ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని తెలిపారు. అలాగే ఆ ఆత్మహత్యలకు దర్శకుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.


గతంలో "పద్మావత్" సినిమాను రిలీజ్ చేస్తే "జోహార్" చేస్తామని రాజపుత్ర కర్ణి సేనకు చెందిన స్త్రీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన స్త్రీలు కూడా ముందుకొచ్చారు. మొత్తం 1908 మంది స్త్రీలు  సినిమా విడుదల చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ప్రధాని మోదీకి తమ సమస్యను విన్నవించుకుంటూ.. అభ్యర్థన పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంద్రజీత్ సింగ్‌‌కి అందజేశారు. తమ ర్యాలీని "చేతావనీ ర్యాలీ"గా ప్రకటించుకున్నారు. ఒకవేళ తమ మాటలు పెడచెవిని పెట్టి సినిమాను విడుదల చేస్తే.. సినిమా థియేటర్ల యజమానులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఈ సందర్భంగా రాజపుత్ర కర్ణి సేన ప్రతినిధులు తెలిపారు.