జమ్ముకాశ్మీర్‌లో పుల్వామ జిల్లాలో జరిగిన దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పాకిస్తాన్‌కి ఓవైపు భారత్ నుంచి ఒత్తిడి అధికమవగా మరోవైపు నుంచి ఇరాన్ నుంచి సైతం ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ అటు ఇరాన్‌ భూభాగంపై ఇటు భారత్ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలు పెంచి పోషిస్తోన్న పాక్ పై ఇరు దేశాలు కన్నెర్రచేస్తున్నాయి. ''సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడానికి భద్రతా బలగాలకు అన్నిరకాల స్వేచ్ఛ కల్పిస్తున్నాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలపగా.. ''తమ సోదరులను బలి తీసుకున్న వారిని మరిచిపోం.. ప్రతీకారం తీర్చుకోకుండా విడిచిపెట్టబోం'' అని సీఆర్పీఎఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇదిలావుంటే, మరోవైపు ఇరాన్‌లో సైతం ఇదే వారం ఆరంభంలో పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు ఇదే తరహాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి రివల్యుషనరీ గార్డ్స్ బలగాలకు చెందిన 27 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనపై రివల్యుషనరీ గార్డ్ దళం చీఫ్ మొహమ్మద్ అలీ జఫరి తీవ్రంగా స్పందించారు. ''తమ సైనికుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని మొహమ్మద్ అలీ ప్రకటించారు. పుల్వామ దాడిలో అమరులైన 40 మంది వీర సైనికులకు భారత్ నలమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చి ఎలాగైతే కన్నీటి వీడ్కోలు పలికారో... అదే తరహాలోనే ఇరాన్‌లోనూ ఆ 27 మంది అమరవీరులకు వారివారి స్వస్థలాల్లో శనివారం అంతిమ వీడ్కోలు పలికారు.