న్యూ ఢిల్లీ: భారత్‌లో రాహుల్ గాంధీ రెచ్చగొడుతున్న వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఇష్టపడుతోందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని అన్నారు. ఎప్పటికప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలు, పాలసీలను ఖండిస్తున్న రాహుల్ గాంధీ నుంచే పాకిస్తాన్ మద్దతు పొందుతోందని ఆమె ఆరోపించారు. బుధవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ''ఒకవైపు కేంద్ర హోంమంత్రి దేశం మొత్తానికి ఒకే జండా, ఒకే రాజ్యాంగం గురించి మాట్లాడుతోంటే, కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ మాటలు వింటూ దేశాన్ని విభజించి మాట్లాడుతోంది''అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఇష్టపడుతోందని, అందుకే ఆయన నుంచి పాక్ మద్దతు పొందుతోందని అన్నారామె. రాహుల్ గాంధీ నుంచి పాకిస్తాన్ ప్రేరణ పొందడం ఇదేమీ మొదటిసారి కాదని.. గతంలో కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాలతో పాకిస్తాన్ ఏకీభవించిన సందర్భాలున్నాయని చెబుతూ.. దేశ ప్రయోజనాల కోసం ఇకనైనా రాహుల్ గాంధీ వేర్పాటువాద రాజకీయాలను మానుకుంటే మంచిదని స్మృతి ఇరాని హితవు పలికారు.


ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వైఖరిపై స్మృతి ఇరాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన దేశంలోనే ఉంటూ మన జాతీయ జండా కోసం ఆలోచించని నేత భారత్‌లోనే ఉండటం నిజంగా దురదృష్టకరం అని ఆగ్రహం వక్తంచేశారు.