వారణాశి జైలులో 16 ఏళ్లు గడిపాక.. భగవద్గీతతో పాకిస్తాన్ వెళ్లాడు..!
వారణాశి సెంట్రల్ జైలులో 16 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించిన జలాలుద్దీన్ అనే పాకిస్తానీయుడు ఇటీవలే విడుదలయ్యాడు.
వారణాశి సెంట్రల్ జైలులో 16 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించిన జలాలుద్దీన్ అనే పాకిస్తానీయుడు ఇటీవలే విడుదలయ్యాడు. 16 సంవత్సరాల క్రితం వారణాశి పోలీసులు కంటాన్మెంట్ ఏరియా వద్ద అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న జలాలుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తని.. ఆయన వద్ద దేశ సరిహద్దుకి సంబంధించిన పలు మ్యాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా బతుకుతెరువు కోసం దేశం సరిహద్దు దాటి ఆ వ్యక్తి వచ్చారని తర్వాత పోలీసుల ఎంక్వయరీలో తేలింది. ఈ క్రమంలో వారణాశి కోర్టు జలాలుద్దీన్‌కి 16 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
అయితే ఈ 16 సంవత్సరాలు కూడా జలాలుద్దీన్ కాలాన్ని వ్యర్థం చేయలేదు. జైలు అధికారుల సహకారంతో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రైవేటుగా రాశాడు. తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. అలాగే ఎలక్ట్రీషియన్ పని నేర్చుకొని.. అదే జైలులో ఎలక్ట్రికల్ పనులు కూడా చేశాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే జలాలుద్దీన్.. జైలు క్రికెట్ లీగ్ టోర్నమెంట్లలో అంపైర్‌గా కూడా పనిచేశాడు.
అంతకు మించి. భగవద్గీతను చదవడం కూడా నేర్చుకున్న జలాలుద్దీన్.. అందులో శ్లోకాలను కూడా చెబుతాడు. ఇటీవలే ఆయన శిక్షా కాలం ముగియడంతో వారణాశి పోలీసులు ఆయనను బోర్డర్ పోలీసులకు అప్పగించారు. ఆ పోలీసులు జలాలుద్దీన్‌ను వాఘా-అత్తారీ బోర్డర్ వద్దకు తీసుకొచ్చి పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించారు. అయితే తన దేశానికి తిరిగి ప్రయాణమవుతూ జలాలుద్దీన్ కేవలం ఒకే ఒక వస్తువును తీసుకెళ్లాడట. అదే భగవద్గీత అని జైలు అధికారులు చెప్పడం గమనార్హం.