ట్రాఫిక్ అలర్ట్: అక్కడ రూ.5,000 నుంచి రూ. 23,000 వరకు నో పార్కింగ్ ఫైన్
నో పార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపి జనాల అసౌకర్యానికి కారణమయ్యే వారికి నేరం తీవ్రత ప్రకారం కనిష్టంగా రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.23,000 వరకు జరిమానా విధించేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
ముంబై: మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై భారీగా జరిమానాలు విధించాలని ముఖ్యమంత్రి హోదాలో అతడు తీసుకున్న నిర్ణయం ఆ సినిమాలో ఎంత హైలైట్ సీన్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇన్నాళ్లూ అది సినిమానే కదా అని సరిపెట్టుకున్నాం కానీ తాజాగా మహారాష్ట్రలో బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ), ముంబై ట్రాఫిక్ పోలీసులు అటువంటి నిర్ణయాన్నే తీసుకుని ఆ రాష్ట్ర వాసులకు షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్, ముంబై ట్రాఫిక్ పోలీసులు కలిసి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నో పార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపి జనాల అసౌకర్యానికి కారణమయ్యే వారికి నేరం తీవ్రత ప్రకారం కనిష్టంగా రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.23,000 వరకు జరిమానా విధించేందుకు అక్కడి అధికారులు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేటి నుంచే ఈ కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ముంబై రోడ్లపై ట్రాఫిక్ జామ్‌కి కారణమవుతున్న అక్రమ పార్కింగ్‌లను నిరోధించేందుకు బీఎంసీ, ముంబై ట్రాఫిక్ పోలీసులు కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. ద్విచక్ర వాహనాలకు రూ.5,000 నుంచి రూ.8,300, త్రిచక్ర వాహనాలకు రూ.8,000 నుంచి రూ.12,200, భారీ వాహనాలకు రూ.15,000 నుంచి రూ.23,000 వరకు జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఆలస్యంగా చలానా చెల్లించే వారికి అదనంగా లేట్ ఫైన్ కూడా బాదనుండటం మరో షాక్.