ఆ మ్యాప్.. కాశ్మీర్ భారత్లో లేదంటుంది..!
దేశ సరిహద్దు వివాదాలపై విద్యార్థులకు లేనిపోని అనుమానాలు లేవనెత్తే ఇలాంటి పాఠాలు బోధించడం వల్ల.. బాలలు అయోమయ పరిస్థితిలో చిక్కుకొనే అవకాశం ఉందని.. మమత బెనర్జీ ప్రభుత్వం ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ నేత రాజు బెనర్జీ డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన సోషల్ పరీక్షల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మ్యాప్ పాయింటింగ్ చేయడానికి విద్యార్థులకు అందించే ఫిజికల్ మ్యాపుల్లో జమ్ము కాశ్మీర్ భారత భూభాగంలో కాకుండా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లు.. అలాగే అరుణాచల్ ప్రదేశ్ భూభాగం చైనాలో ఉన్నట్లు ఇండికేషన్లు ఉండడం వల్ల పలువురు అభ్యంతరం చెబుతున్నారు. అసలు అలాంటి మ్యాపులు ఎవరు ప్రచురించారన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి రాజు బెనర్జీ స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు చిహ్నంతో ఆ మ్యాపులు ప్రచురించడం వెనుక కారణాలేమిటో తెలుసుకోవడానికి పోలీసు ఎంక్వయరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశ సరిహద్దు వివాదాలపై విద్యార్థులకు లేనిపోని అనుమానాలు లేవనెత్తే ఇలాంటి పాఠాలు బోధించడం వల్ల.. బాలలు అయోమయ పరిస్థితిలో చిక్కుకొనే అవకాశం ఉందని.. మమత బెనర్జీ ప్రభుత్వం ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలని రాజు బెనర్జీ డిమాండ్ చేశారు. ఇంతకీ కాశ్మీరు, అరుణాచల్ ప్రాంతాలు భారత భూభాగంలో ఉండడం పట్ల బెంగాల్ ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ విషయంపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని ఆయన తెలిపారు. మమత బెనర్జీ ప్రభుత్వం కొంపదీసి తీవ్రవాదులు, ఉగ్రవాదులను ప్రోత్సహించడం లేదు కదా..! ఒకవేళ అదే నిజమైతే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అని రాజు బెనర్జీ చెప్పారు. 2017 పదవ తరగతి బోర్డు పరీక్షల్లో భాగమైన మాధ్యమిక పరీక్ష ప్రశ్నాపత్రానికి అనుబంధంగా ఆ మ్యాపులు విద్యార్థులకు సరఫరా చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.