ఆ ఒక్క ట్వీట్.. 26 మంది మైనర్ బాలికలను కాపాడింది
ముజఫర్ పూర్, బాంద్రా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 26 మంది మైనర్ బాలికలు ఆపదలో ఉన్నారని భావించి ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ వారి పాలిట రక్షణ కవచమైంది.
ముజఫర్ పూర్, బాంద్రా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 26 మంది మైనర్ బాలికలు ఆపదలో ఉన్నారని భావించి ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ వారి పాలిట రక్షణ కవచమైంది. వివరాల్లోకి వెళితే.. జూన్ 5, 2018 తేదిన ఎస్ 5 కోచ్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు, అదే బోగిలో తన పాటు ప్రయాణిస్తున్న అనేకమంది బాలికలు కాస్త అసహనంతో ఉండడం గమనించాడు. వారిలో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకోవడం ఆయన చూశారు. కారణమడిగితే వారి నుండి ఎలాంటి సమాధానం కూడా రాలేదు.
వారు అదే బోగిలో మరో ఇద్దరు పురుషులతో ప్రయాణిస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి కాస్త అనుమానాస్పదంగా ఉండడంతో సదరు ప్రయాణికుడు వారణాశి పోలీసులతో పాటు చైల్డ్ లైన్ సంస్థకు కూడా ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన పోలీస్ విభాగం వెంటనే స్పందించింది. జీఆర్పీ... ఆర్పీఎఫ్ జవాన్లను అప్రమత్తం చేసింది. వెంటనే వారు రైల్వే పోలీసుల సహాయంతో బోగిలోకి వెళ్లారు.
ఆ తర్వాత ఆ బాలికలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వివరణ కోరగా.. వారు సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వారిని బాలికలను అక్రమంగా తరలించే వ్యక్తులుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే వారితో పాటు ప్రయాణిస్తున్న 26 మంది బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించి.. వారి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరణ కోరారు. ఆ బాలికలందరూ కూడా పశ్చిమ చంపారన్ (బీహార్) ప్రాంతవాసులని విచారణలో తేలింది.