ఇప్పటి వరకు ఇంటి చిరునామాకు గల ఆధారాల్లో ఒకటిగా పనిచేసిన పాస్‌పోర్ట్ ఇకపై అలా చెల్లబోదు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పనుల నిమిత్తం పాస్‌పోర్టుని అడ్రస్ ప్రూఫ్‌గా ఇవ్వడం ఇకపై కుదరదు. ఇప్పటివరకు పాస్‌పోర్ట్ బుక్ చివరన చిరునామా కలిగి వుండే చివరి పేజీని ఇకపై ముద్రించకూడదు అని కేంద్రం నిర్ణయించుకోవడమే అందుకు కారణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విదేశీ వ్యవహారాల శాఖ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు భాగస్వాములుగా వున్న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ యాక్ట్ 1967, పాస్‌పోర్ట్ రూల్స్ 1980 చట్టాల ప్రకారం జారీచేసే పాస్‌పోర్ట్ చివరి పేజీని ఇకపై ముద్రించకూడదు అని ప్యానెల్ నిర్ణయించింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది మాతృమూర్తులు / పిల్లలు తమ తండ్రి పేరుని పాస్ పోర్టుపై ముద్రించకూడదు అని దరఖాస్తులలో విజ్ఞప్తి చేయడం వంటి సందర్భాలని పరిశీలించిన అనంతరమే త్రిసభ్య ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రమే వున్న పిల్లలు, దత్తత ద్వారా వారసులైన పిల్లలు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని కూడా ప్యానెల్ పరిశీలించింది. 


పాస్‌పోర్టు చివరి పేజీలో చిరునామాతోపాటు వారి తల్లిదండ్రుల పేర్లు, లేదా భర్త, భార్య పేరు కూడా ముద్రించి వుండటం అనేది ఇప్పటివరకు కొనసాగుతున్న సాధారణ ప్రక్రియ. అయితే, మొత్తంగా ఆ పేజీనే తొలగిస్తే, ఆ వివరాలు పొందుపర్చడంలో ఇబ్బందులు ఎదుర్కునే వారి అవస్థలు కూడా తప్పినట్టే అనే ఉద్దేశంతోనే ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని నాసిక్‌లో వున్న ఇండియన్ సెక్యురిటీ ప్రెస్ ఈ కొత్త పాస్ పోర్టులని ముద్రించనుంది. ఇప్పటికే జారీ చేసిన పాస్‌పోర్ట్స్ వాటి కాల పరిమితి ముగిసే వరకు యధావిధిగా చెల్లుబాటు కానున్నాయి.