న్యూఢిల్లీ: వినియోగదారుల ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టి విజయం సాధించిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ఇప్పుడు టెలికాం రంగంలో అడుగుపెట్టింది. ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం చేసుకొని స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌ కార్డులను మార్కెట్లోకి విడుదల చేయనుంది.


పతంజలి సంస్థ అందించే సిమ్ కార్డు ఆఫర్లను కూడా ప్రకటించింది. రూ.144తో రీఛార్జి చేసుకుంటే 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చట. ఈ సిమ్ కార్డుతో వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చట. ప్రస్తుతం సంస్థ ఉద్యోగులకే పరిమితం చేసిన సిమ్ కార్డులను త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు రూ.2.5- 5 లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమాను కూడా ప్రజలకు అందిస్తామని పతంజలి సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 5 లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి సిమ్ కార్డును పొందవచ్చని యోగా గురువు రాందేవ్ బాబా వెల్లడించారు.