హెల్మెట్స్ ధరించి ఉల్లిగడ్డ విక్రయాలు
ఉల్లిపాయ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని కోస్తున్నప్పుడే కన్నీళ్లొచ్చేటివి... కానీ కిలో ఉల్లి ధర రూ.70-80 పైనే పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి పేరెత్తితేనే కన్నీళ్లొస్తున్నాయంటున్నారు వినియోగదారులు.
న్యూ ఢిల్లీ: ఉల్లిపాయ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని కోస్తున్నప్పుడే కన్నీళ్లొచ్చేటివి... కానీ కిలో ఉల్లి ధర రూ.70-80 పైనే పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి పేరెత్తితేనే కన్నీళ్లొస్తున్నాయంటున్నారు వినియోగదారులు. పశ్చిమ బెంగాల్లోనైతే కిలో ఉల్లిపాయ రూ.100 వరకూ పలుకుతోంది. ఉల్లి ధరలు అంతలా కొండెక్కి కూర్చున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడైనా కిలో ఉల్లిపాయ రూ.35కి లభిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిరుపేదలకు రేషన్‌పై కిలో ఉల్లిపాయ 35 రూపాయలకే విక్రయించాలని భావించిన బీహార్ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్.. అక్కడక్కడా కేంద్రాలు ఏర్పాటు చేసి గత వారం రోజులుగా విక్రయాలు ప్రారంభించింది. ఒక్కో కుటుంబానికి 2 కిలోల ఉల్లిపాయ మాత్రమే విక్రయిస్తుండగా.. ఆడ పిల్ల పెళ్లి చేసే కుటుంబానికి ఆహ్వాన పత్రికను ఆధారంగా పరిగణిస్తూ 25 కిలోల వరకు ఉల్లిపాయ అందిస్తున్నారు. దీంతో ఉల్లిపాయ విక్రయ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. గత వారం రోజుల్లో పలు చోట్ల తొక్కిసలాంటి ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు, ఎక్కడ జనం మీద విరుచుకుపడి భారీ తొక్కిసలాట చోటుచేసుకుంటుందో ఏమోననే భయంతో ఇదిగో మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఇలా ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్స్ ధరించి ఉల్లిపాయ విక్రయిస్తున్నారు.
ఇదే విషయమై రోహిత్ కుమార్ అనే ఓ అధికారి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. గతంలో ఉల్లిపాయ విక్రయ కేంద్రాల వద్ద రాళ్లు విసిరిన ఘటనలు కూడా ఉన్నాయని.. అందుకే ఆత్మరక్షణ కోసమే ఇలా హెల్మెట్స్ ధరించాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఎటువంటి రక్షణ కల్పించడం లేదు కనుకే తాము ఇలా సొంత ఏర్పాటు చేసుకున్నామని సదరు సిబ్బంది తెలిపారు.