మళ్లీ పెట్రో ‘బాదుడు’.. వరుసగా నాలుగో రోజు పెరిగిన ధరలు
పెట్రో ధరలు మళ్లి పెరిగాయి.
పెట్రో ధరలు మళ్లి పెరిగాయి. వరుసగా నాలుగోరోజు కూడా మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం ఇందుకు కారణాలుగా ఆయిల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ-ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన తాజా పెట్రో ధరల మేరకు...దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.80.50గా ఉంది. చెన్నైలో రూ.83.66, కోల్‌కత్తాలో రూ.83.39, ముంబైలో రూ.87.89గా ఉంది.
నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలతో పాటు డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రూ.72.61, ముంబైలో రూ.77.09, కోల్‌కత్తాలో రూ.75.46, చెన్నైలో రూ.76.75గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.85.35లు ఉండగా, డీజిల్ రూ.78.98లుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర రూ.86.81, డీజిల్ రూ.80.09గా ఉంది. సవరించిన ధరలు మెట్రో నగరాల్లో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్‌తో పాటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తున్నాయి.