నిత్యం అంతకంతకు పెరుగుతూపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పైపైకే ఎగబాకుతున్న ధరలు సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనమైపోతుండటం, మరోవైపు ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలను పెరిగేలా చేస్తు్న్నాయని, ఫలితంగానే పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరల సమీక్ష అనంతరం ఇవాళ హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.91, డీజిల్ ధర రూ.78.48గా ఉంది. ఇవాళ ధరల సమీక్ష అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.99గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.72.02కి చేరింది. ఇక కోల్ కతాలో ఇంధనం ధరల విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర రూ.82.88గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ74.92 వద్ద ఉంది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయి ఇదే కావడం గమనార్హం.


ఇంతకుముందెప్పుడూ లేనివిధంగా శుక్రవారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.39కి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర ఇంత అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఇవాళ ఒక్కరోజే లీటర్‌కు 48 పైసలు పెరగడంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రికార్డ్ స్థాయిని అందుకుంది. ఇక డీజిల్ విషయానికొస్తే, లీటర్ డీజిల్ ధర రూ.79.99 వద్ద ఉంది.