ఇటీవల వారం, పది రోజుల కింది వరకు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరిగిన తీరు వాహనదారులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గుముఖం పడుతుండటంతో అంతేకొద్ది స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల్లో సైతం తగ్గుదల చోటుచేసుకుంటుండటం గతంతో పోల్చుకుంటే కొంత ఉపశమనం కలిగించే విషయం. వరుసగా శనివారం కూడా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కి 19 పైసలు, డీజిల్ లీటర్‌కి 11 పైసలు తగ్గింది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 78.99 ఉండగా డీజిల్ ధర రూ.73.53గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.49 ఉండగా డీజిల్ ధర రూ.77.06గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఇంధనం ధరల విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర రూ. 83.75 ఉండగా డీజిల్ ధర రూ.80.00గా ఉంది. ఇక ప్రీమియం పెట్రోల్ ధర అయితే రూ.86.51 వరకు ఉంది. 


అక్టోబర్ 18 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత తగ్గుతుండగా, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ సైతం అంతకుముందు కన్నా కొంత బలపడటమే ఈ ధరల తగ్గుదలకు కారణం అని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలిపాయి. అయితే, ఈ పరిస్థితులు ఇలా ఎప్పటివరకు కొనసాగుతాయనే సందేహానికి సరైన సమాధానం చెప్పడం కష్టమే అంటున్నారు మార్కెట్ నిపుణులు.