కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధాన్ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన-పీఎంజేఏవై) కార్యక్రమం ఆదివారం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి మోదీ పీఎంజేఏవైని ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పీఎంజేఏవై పథకం కింద 10.74 కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా అందనుంది. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలకు ప్రభుత్వం లేఖలను పంపింది. ఇందులో ప్రధాని మోదీ ఫొటోతో పాటు బీమా పథకం వల్ల కలిగే ప్రయోజనాలను, ఏయే ఆస్పత్రుల్లో ఇది వర్తిస్తుందనే వివరాలను పొందుపరిచినట్లు సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 'నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఏ) పర్యవేక్షణలో ఈ పథకం అమలుకానుంది.


ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది.లబ్దిదారులు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వం సూచించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా.. వారి వయసుతో నిమిత్తం లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


కాగా.. ఈ పథకంలో చేరే కుటుంబాలు రూ.2000 లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ర్టాల్లో అమలవుతున్న  రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది.


ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?


అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతో గానీ, రేషన్‌కార్డుతో గానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 14555కు కాల్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకై mera.pmjay.gov.in వెబ్‌సైట్‌‌లో చూడవచ్చు.  ఇప్పటికే ఈ పథకం అమలు కోసం చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


సెప్టెంబర్‌ 23న 'ఆయుష్మాన్‌ భారత్‌' సందర్భంగా.. కోడర్మాలో మెడికల్‌ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్‌ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో 10 ఆరోగ్య కేంద్రాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.


రాంచీ పర్యటన ముగిసిన తరువాత, ప్రధానమంత్రి మోదీ గాంగ్టక్‌కు బయలుదేరుతారు. అక్కడ సెప్టెంబర్ 24న పాకియాంగ్ విమానాశ్రయంను మోదీ ప్రారంభిస్తారు.