ఏప్రిల్ 27న ప్రధాని మోడీ చైనా పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 27న, రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనాకు బయల్దేరివెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 27న, రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనాకు బయల్దేరివెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలపై చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌తో చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాక మోదీ చైనాలో పర్యటించటం ఇది నాలుగోసారి.
ఈ పర్యటన ఇరుదేశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఆదివారం నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఇ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతోపాటు అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అవగాహన పెంచుకునేలా అభిప్రాయాలను వ్యక్తీకరించుకుంటారని వాంగ్‌ఇ చెప్పారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై కూడా ఇరువురు నేతలూ చర్చిస్తారని సుష్మా స్వరాజ్ వివరించారు. ఈ భేటీ భవిష్యత్తుకు దిశానిర్దేశానికి వీలు కల్పిస్తుందని స్వరాజ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
మరోవైపు, సిక్కింలోని నాథు లా మార్గం మీదుగా ఈ ఏడాది కైలాస మానసరోవర్ యాత్రను పునరుద్ధరించడానికి రెండు దేశాలూ అంగీకరించుకున్నాయి. డోక్లామ్ ప్రతిష్టంభనతో 10 నెలలుగా ఈ మార్గంలో యాత్ర నిలిచిపోయింది.